జియోఫైబర్ వాణిజ్య సేవల వెల్లడి : ప్లాన్స్ కేవలం రూ.700 నుండి రూ. 1000 మాత్రమే
ఫస్ట్-డే-ఫస్ట్-షో సినిమాలను కూడా ఇళ్ల నుండి చూసే అవకాశం అందిస్తోంది.
తన 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ జియో తన జియోఫైబర్ ఇంటర్నెట్ సేవలను వాణిజ్యపరంగా సెప్టెంబర్ 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జియో మొదటగా, గత సంవత్సరం తన ఫిక్స్డ్ -లైన్ ఇంటర్నెట్ సేవను ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు, కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది ఎంపిక చేసిన వినియోగదారులతో బీటా టెస్టింగ్ లో భాగంగా సేవలను అందిస్తోంది. తమ జియోఫైబర్ సర్వీసును 100 Mbps స్పీడ్ నుంచి అందిస్తుందని, ఇది అత్యధికంగా 1 Gbps వరకు పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. జియో తన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ యొక్క ప్లాన్లు మరియు ధరల పైన సరైన వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే, దీని కోసం రూ .700 నుంచి 10,000 రూపాయల మధ్య ధర నిర్ణయించనున్నట్లు మాత్రం ధృవీకరించింది.
అంటే జియోఫైబర్ సర్వీస్ 100 Mbps వేగంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది మరియు సుమారు 700 రూపాయల నుండి దాని ధర ప్రారంభమవుతుంది. అయితే, బేస్ ప్లాన్‌లతో ఎంత డేటా అందించబడుతుందో మాత్రం ఇంకా తెలియదు. సెప్టెంబర్ 5 న ఈ సేవను ప్రారంభించినప్పుడు మేము దీని గురించి మరింత వివరమైన సమాచారాన్ని అందిస్తాము. జియో ఫైబర్ ప్లాన్స్ కూడా OTT ప్లాట్‌ఫామ్‌లకు సబ్ స్క్రిప్షన్ తో ఉంటాయి మరియు కంపెనీ పేర్లు ఇవ్వకపోయినా, అమెజాన్ ప్రైమ్ వీడియోలు మరియు నెట్‌ఫ్లిక్స్ వంటివి అందించవచ్చు.
ప్రీమియం జియోఫైబర్ చందాదారులకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయని కంపెనీ చెబుతున్నది కాబట్టి, జియోఫైబర్ సేవలో వేర్వేరు సబ్ స్క్రిప్షన్ సిరీస్ లు కూడా ఉండవచ్చు. ఒక ఆసక్తికరమైన ప్రకటన ఏమిటంటే, ప్రీమియం జియోఫైబర్ చందాదారులు తమ ఇళ్ల నుండి ఫస్ట్-డే-ఫస్ట్-షో సినిమాలను కూడా చూసే అవకాశం అందిస్తోంది. అంటే, సినిమాలు థియేటర్లలోకి వచ్చిన అదే సమయంలో మీరు మీ ఇంట్లో నుండే ఆ సినిమాలను చూడొచ్చు. ఈ ప్రత్యేక సేవ 2020 మధ్యకాలంలో ప్రారంభించబడుతుంది.
రిలయన్స్ జియో యొక్క హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కూడా ఫిక్స్‌డ్ – లైన్ సర్వీస్ తో వస్తుంది మరియు ఫిక్స్‌డ్ – లైన్ నుండి అన్ని వాయిస్ కాల్‌లు ఉచితం కాబట్టి డేటా కోసం మాత్రమే డబ్బును చెల్లించాల్సిన అవసరం ఉందని కంపెనీ ప్రకటించింది. జియో తన ఫిక్స్డ్ లైన్ కాలింగ్ సర్వీస్ నుండి అంతర్జాతీయ కాలింగ్‌కు అతి తక్కువ రేట్లతో సర్వీస్ అందిస్తుందని చెప్పారు. ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, డిఫాల్ట్ టారిఫ్ లు, ప్రస్తుత పరిశ్రమ రేట్లలో పదోవంతు మాత్రమే ఉండనున్నట్లు చెబుతున్నారు. యుఎస్ / కెనడా కోసం కొత్త అపరిమిత అంతర్జాతీయ కాలింగ్ ప్యాక్ కూడా నెలకు రూ .500 కు లభిస్తుంది.