భారతీయ మార్కెట్లో చైనా మొబైల్ కంపెనీల యొక్క హావ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఫోన్ల అమ్మకాలలో, దాదాపుగా సగానికి పైగా మొబైల్ ఫోన్లు చైనా దిగ్గజ కంపెనీలవే అయినట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. అంతేకాకుండా, నాలుగు చైనా దిగ్గజ కంపెనీలైన షావోమి, హానర్, ఒప్పో మరియు వివో వంటి కంపెనీల ఫోన్ల కొనుగోలు కోసం 50,000 కోట్లకు పైగానే భారతీయులు ఖర్చుచేసినట్లు కూడా నివేదికలు తెలియ చేస్తున్నాయి.
ఈ నివేదికలను పరిశీలిస్తుంటే, భారతీయ మొబైల్ మార్కెట్టు పైన చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు అనిపిస్తుంది. ముందు నుండే ఇండియన్ మార్కెట్లో దూసుకెళుతున్న, ఈ నాలుగు కంపెనీలే కాకుండా ఇప్పుడు కొన్ని ఇతర కంపెనీలైన వన్ ప్లస్, ఇన్ఫ్లిక్స్ మరియు లెనోవో-మోటరోలా వంటి కంపెనీలు కూడా వాటి ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. క్రిత సంవత్సరం కంటే, రెండు రేట్ల అమ్మకాలను ఈ చైనా కంపెనీల యొక్క ఫోన్లు సాధించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
తక్కువ ధరలో, మంచి లక్షణాలు మరియు ప్రత్యేకతలతో మొబైల్ ఫోన్లను తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ మార్కెట్లో, స్మార్ట్ ఫోన్లు అధికంగా కొనుగోలు చేసే భారతీయ మార్కెట్ ని లక్ష్యంగా చేసుకొని ఈ చైనీయ కంపెనీలు వాటి తయారీ ఫ్యాక్టరీలను కూడా భారతదేశంలో స్థాపించాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల నుండి తయారీ చేసే ఫోన్లు మన్నికైనవయినా కూడా వాటి ధరలలోని అంతరం ఈ చైనీయ కంపెనీల ఫోన్లు కొనుగోలు చేసేలా మొగ్గుచూపుతున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు.