మీకు తెలియని అద్భుతమైన టాప్ 20 గూగల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లు

మీకు తెలియని అద్భుతమైన టాప్ 20 గూగల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లు
HIGHLIGHTS

కచ్చితంగా ఇవి మీకు విపరీతంగా నచ్చుతాయి, అంతకు మించి ఉపయోగపడతాయి.

ఇంటర్నెట్ వాడుకలో మనం ఎక్కువుగా ఉపయోగించేది గూగల్ క్రోం బ్రౌజర్. దీనిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద మైనస్, ఎక్కువసేపు వాడుతుంటే ఫ్రిజ్ అయిపోతుంది. క్రోమ్ అలా స్లో అవకుండా ఉండటానికి ఒక ఆర్టికల్ మొన్ననే నేను వ్రాసాను. దానిని ఇక్కడ పొందగలరు.

క్రోమ్ ను ఫాస్ట్ గా తాయారు చేసుకున్నాక ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ని బాగా ప్రొడక్టివ్ గా ఉపయోగించుకోవడానికి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని వందల క్రోమ్ ఎక్స్టెన్షన్ లో టాప్ ది బెస్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ను మీకోసం వెతికి అందిస్తున్నాము. కచ్చితంగా ఇవి మీకు నచ్చుతాయి. అంతకు మించి ఉపయోగాపడతాయి.

గమనిక: క్రోమ్ ఎక్స్టెన్షన్ లను ఎక్కువుగా వాడితే బ్రౌజర్ స్పీడ్ తగ్గుమొఖం పడుతుంది. అందుకని ఏ ఒక్కటి అనవసరంగా అనిపించినా దానిని డిలిట్ చేసుకోండి.

సెక్యూరిటీ:
ఇంటర్నెట్ అనేసరికి చిన్న చిన్న క్లిక్ లు ద్వారా అనేక పనులు జరిగిపోతుంటాయి. వాటిలో మనకు హాని కలిగే పనులు కూడా ఉంటాయి. మనకు తెలియకుండానే మన డేటా ఇతరులుకు వెళ్ళే వైరెస్ లు చాలా ఉంటాయి. వాటి నుండి దూరంగా ఉండటానికి ఈ సెక్యురిటీ ఎక్స్టెన్షన్ ఉపయోగపడతాయి.

1. NO ADs: ఇంటర్నెట్ ను ఎక్కువుగా బ్రౌజ్ చేసేవాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ప్రధానమైనది, ఏడ్స్. వీటి నుండి విముక్తి పొందటానికి క్రోమ్ లో చాలా ఏడ్ బ్లాకర్స్ ఉన్నాయి. అయితే AdBlock అనే ఎక్స్టెన్షన్ ఇతర వెబ్ సైట్లతో పాటు యుట్యూబ్ మరియు ఫేస్బుక్ వంటి వాటిలో కూడా ఏడ్స్ ను తొలిగిస్తుంది. దీని వలన ఇంటర్నెట్ స్పీడ్ పెరగటమే కాకుండా, అసభ్యకరమైన ఏడ్స్ మరియు స్పామ్ (వైరస్) లనుండి ప్రశాంతంగా మీరు ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.

2. Disconnect అనే ఎక్స్టెన్షన్ మీ ఇంటర్నెట్ ను సెక్యూర్ గా, స్పీడ్ గా మరియు మరింత ప్రైవేసీ గా ఉంచటానికి ఉపయోగపడుతుంది. దాదాపు 2000 పైగా వెబ్సైట్లు మీ బ్రౌజింగ్ హిస్టరీ ని సెర్చ్ డేటా ని ట్రాక్ చేయకుండా అడ్డుకుంటుంది ఇది.

3. HTTPS Everywhere అనే ఎక్స్టెన్షన్ మీరు ఏ వెబ్సైటు లాగిన్ పేజ్ ఓపెన్ చేసినా కచ్చితంగా అది https(Secure) ను కలిగి ఉండేలా చూసుకుంటుంది. ఇది ఫిషింగ్ లేదా సెక్యూర్ లాగిన్ సిస్టం లేని పేజ్ ల భారి నుండి మిమల్ని కాపాడుతుంది.

4. Link Me Not అనే ఈ ఎక్స్టెన్షన్ ఫేస్బుక్ లేదా ఇతర సైట్లలో మీకు అప్పుడప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి లేదా మీ అభిమాని తార ఫోటోలు కనిపిస్తాయి అంటూ కొన్ని వైరస్ లింకులు మీ ఫ్రెండ్స్ నుండి వస్తుంటాయి. పంపింది మీ ఫ్రెండ్సే కదా అని మీరు అవి స్పామ్ లింక్స్ (వైరెస్) అని తెలియక వాటిని క్లిక్ చేస్తే ఆ  తరువాత మీ ఫేస్బుక్ హాక్ అవ్వటం లేదా మీ ప్రమేయం లేకుండా అసభ్యకరమైన ఫోటోలతో లింకులు మీరు  స్వయంగా పోస్ట్ చేసినట్టు పోస్ట్ అవ్వటం జరుగుతాయి. అలాంటి సందర్భాలు రాకుండా మీరు క్లిక్ చేయబోయే  లింక్ చెడ్డది అయితే ఆ లింక్ ఛివరిలో రెండు రెడ్ కలర్ మార్క్స్ ను చూపిస్తుంది ఈ ఎక్స్టెన్షన్.

5. పాస్వర్డ్ మేనేజర్: నెటిజన్లకు ఎక్కువుగా ఇబ్బంది పెట్టే మరొక విషయం పాస్వర్డ్ లను గుర్తించుకోవటం. ఇప్పుడున్న అనేక వెబ్ సర్వీసులు, సెక్యురిటీ కారణాల వలన పాస్వర్డ్ ను అతి క్లిష్టంగా తాయారు చేయమని యూజర్లకు ఒత్తిడి పెడుతున్నాయి. అవి మన భద్రతాంశాలును దృష్టి లో పెట్టుకొని చేస్తున్నప్పటికీ, మనకు మాత్రం అవన్నీ గుర్తు పెట్టుకోవటం చాలా కష్టం. దీని కోసం LastPass అనే ఎక్స్టెన్షన్ లభిస్తుంది. ఇది మొబైల్ మరియు పిసిల అన్ని ప్లాట్ఫారం లకు లభ్యమవుతుంది. ఇందులో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసుకొని, దాని మాస్టర్ పాస్వర్డ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఎక్స్తేన్స్హన్ ఇంస్టాల్ చేసుకున్నాక, మీరు ఏ వెబ్సైటు లో కొత్తగా రిజిస్టర్ అయినా దాని పాస్వర్డ్ ను మొదటి సారి మీరు క్రియేట్ చేస్తే చాలు, ఆ పాస్వర్డ్ ని లాస్ట్ పాస్ ఎక్స్టెన్షన్ గుర్తుపెట్టుకొని, మరలా ఎప్పుడైనా ఆ వెబ్సైటు లోకి లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ బాక్స్ లో ఉండే స్టార్ మార్క్ ను క్లిక్ చేస్తే లాస్ట్ పాస్ మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు, మీరు లాగిన్ అవ్వాలని అనుకుంటున్న సైటు పాస్వర్డ్ ఆటోమేటిక్ గా అక్కడ ఎంటర్ అయిపోతుంది. ఇదే పని మాస్టర్ పాస్వర్ద్లు ఏమీ లేకుండా ‘రిమెంబర్ పాస్వర్డ్’ అనే ఆప్షన్ ద్వారా క్రోమ్ బ్రోజర్ కూడా చేస్తుంది. కాకపొతే క్రోమ్ గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ ఇతర వ్యక్తులు ఎవరైనా మన బ్రౌజర్ ని వాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా మన యూసర్ ఐడి, పాస్వర్డ్ లతో లాగిన్ అయిపోగలుగుతారు. అందుకని ఇది సరైనది కాదు.

షాపింగ్:
నెట్ లో షాపింగ్ చేయటం ఇప్పుడు అందరికి అలవాటుగా మారింది. మీకు తెలియని అద్భుతమైన షాపింగ్ ఎక్స్టెన్షన్ల ఇక్కడ తెలుసుకోండి.

6. BUYHatke అనే ఎక్స్టెన్షన్ ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువుగా ఇష్టపడే వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ప్రాడక్ట్ (ఉదా: మొబైల్) కొనదామని దాని బయింగ్ పేజ్ (ఏ వెబ్సైటు అయినా) ఓపెన్ చేస్తే, మిగతా వెబ్సైట్లలో ఆ ప్రాడక్ట్ ఎంత ప్రైస్ కు దొరుకుతుంది, ఎక్కడ తక్కువుగా లభిస్తుంది వంటి ఇన్ఫర్మేషన్ ను ఇది మీకు చూపిస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ మరియు స్నాప్ డీల్ షాపింగ్ సైట్లలో మీరు ప్రతీ ప్రాడక్ట్లు క్రింద ఆ ప్రాడక్ట్ ఆయా సైట్లలో ఎప్పుడు ఎంత ప్రైస్ కి అమ్మారు, మీరు ఇప్పుడు కొనవచ్చా లేదా, అనే గ్రాఫ్ ఇస్తుంది. ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఆ ప్రాడక్ట్ త్వరలో తగ్గుతాదా లేదా అనే అంచనాను వేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్టెన్షన్ తన తరుపున అప్పుడప్పుడు కొన్ని డిస్కౌంట్ లను కూడా ఇస్తుంది. నేను ఇ-బే వెబ్సైటు లో కొన్న ప్రాడెక్ట్ కి రూ.1000 డిస్కౌంట్ ఆప్షన్ ఇచ్చింది. ( కాకపొతే ఇంకా రిఫండ్  పెండింగ్ దశలో ఉంది అనుకోండి 😛 )

7. MySmartPrice అనే ఎక్స్టెన్షన్ కూడా BUYHatke ఎక్స్టెన్షన్ లాంటిదే, కాని తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ప్రాడక్ట్ ని ఓపెన్ చేస్తే ఇది వెంటనే ఆ పేజ్ క్రింద కుడివైపు “కంగ్రాట్స్ మీరు కొనబోయే ప్రాడక్ట్ అతి చవకగా ఇక్కడే దొరుకుతుంది” అని  మెసేజ్ ఇస్తుంది. ఒకవేళ వేరే వెబ్సైటు లో ఇంకా తక్కువుగా అమ్ముతుంటే, ఆ డిటైల్స్ దగ్గర క్లిక్ చేస్తే తక్కువుగా దొరుకుతున్న సైట్ల లిస్టు మీకు ఇస్తుంది.

బాగా ఉపయోగపడేవి:
8. Tab Suspender ఈ ఎక్స్టెన్షన్ మీరు క్రోమ్ లో అనవసరంగా ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టుకున్న టాబ్ లను మీకు నచ్చిన టైం ఫ్రీక్వెన్సీ తో ఆటోమాటిక్ గా ఆ టాబ్ లో ఉన్న సైటు ని పార్క్ (క్లోజ్ చేయదు కాని వెబ్ కంటెంట్ లోడ్ అయి ఉండదు) చేసి బ్రౌజర్ ను వేగవంతంగా పని చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది.

9. సాధారణంగా ఒకే బ్రౌజర్ విండోలో (ఒకే టాబ్ లో కాదు) మనం ఒకటికి మించి ఏదైనా సైట్లలో(జి-మెయిల్, ఫేస్బుక్, ట్విటర్ etc) లాగిన్ అవ్వటానికి కుదరదు. కాని MultiLogin ఎక్స్టెన్షన్ తో అది సాధ్యమవుతుంది. మీరు ఒక మెయిల్ ఐడి తో లాగిన్ అయ్యి ఉండగా మరొక మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వటానికి, బ్రౌజర్ పైన కుడివైపున ఎక్స్టెన్షన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే, కొత్త టాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావలిసిన వెబ్సైటు యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ చేసుకుని అదే విండోలో ఒకేసారి రెండు మెయిల్ ఐడి లతో లాగిన్ అవచ్చు. ఇలా ఏ వెబ్సైటును అయినా, ఎన్ని ఐడి లాగిన్లు అయినా చేసుకోవచ్చు.

10. ఈమెయిలు ట్రాకింగ్: మెయిలింగ్ ను ఎక్కువగా వాడే యూజర్స్ కు Streak for Gmail చాలా ప్రొడక్టివ్ ఎక్స్టెన్షన్. ఇది ఇంస్టాల్ చేసుకుని, మీ జి- మెయిల్ అకౌంట్ కి అనుసంధానం చేసుకోండి. డిఫాల్ట్ గా ట్రాకింగ్ ను ఎనేబల్ చేసుకోండి. ఇక మీరు పంపే ప్రతీ మెయిల్ అవతల వ్యక్తులు ఓపెన్ చేసారో లేదో మీకు నోటిఫికేషన్ పంపుతుంది. ఒక వేల మీరు నోటిఫికేషన్ మిస్ అయినా, సెంట్ మెయిల్ లోకి వెళ్లి మీరు పంపిన మెయిల్ ఓపెన్ చేస్తే కుడివైపున మీరు మెయిల్ పంపిన వ్యక్తి దానిని ఎప్పుడు చూసారు, ఎన్ని సార్లు చూసారు, ఎంత మంది చూసారు లాంటి విషయాలను తెలుసుకుంటారు. ఇది మెయిల్స్ షెడ్యూల్ కూడా చేస్తుంది. కాని షెడ్యూల్ మెయిల్ ని ట్రాకింగ్ చేయటానికి మాత్రం కుదరదు. మీరు పంపే మెయిల్ లో అంతర్గతంగా చిన్న పిక్సెల్ ఇమేజ్ ఉంటుంది, మీరు మెయిల్ పంపిన వ్యక్తి మెయిల్ ఓపెన్ చేయగానే ఆహ ఇమేజ్ లోడ్ అవటంతో ఈ ఎక్స్టెన్షన్ అవతల వ్యక్తి మెయిల్ చూసినట్టు మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.

11. OneClick Cleaner ఎక్స్టెన్షన్ తో మీ బ్రౌజర్ లోని అన్ని రకాల కేచీలతో పాటు బ్రౌజర్ హిస్టరీ వంటివి ఓకే ఒక క్లిక్ తో (ఇంస్టాల్ చేసుకున్నాక ఎక్స్టెన్షన్ ఐకాన్ పై క్లిక్ చేసి) క్లీన్ చేసుకొని బ్రౌజర్ స్పీడ్ ను ఇన్స్టాంట్ గా పెంచుకోవచ్చు.

12. మీరు బ్రౌజ్ చేసుకుంటున్న టాబ్ లన్నింటిని ఒకేసారి దాచిపెట్టి మళ్ళీ మీకు కావలిసినప్పుడు తెరవాలి అనుకుంటే PanicButton ఎక్స్టెన్షన్ ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా ఆఫీసుల్లో మీరు ఆఫీస్ పని కాకుండా సొంత పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు బాస్ కు దొరకకుండా ఉండటానికి పనికొస్తుంది.

13. ఫోన్ నోటిఫికేషన్లు: మీ ఫోన్ కు వచ్చే నోటిఫికేషన్లు అన్ని మీరు కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు మీ పిసి లో కనపడాలని అనుకుంటే, Pushbullet ఎక్స్టెన్షన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది అండ్రాయిడ్ ఫోన్లను సపోర్ట్ చేస్తుంది. మీ బ్రౌజర్ క్లోజ్ అయిపోయినా ఇది నోటిఫికేషన్లు చూపిస్తుంది. ఇందులో మరొక అద్భుతమైన ఫీచర్ ఉంది మీ మొబైల్ లో ఏదైనా టెక్స్ట్ ను కాపీ చేసి దానిని అదే పుష్ బుల్లెట్ మెయిల్ ఐడి తో వాడుతున్న ఇతర డివైజ్ (పిసి లేక మరొక మొబైల్) లోకి పేస్ట్ చేసుకోవచ్చు.

14. SimpleExtManager ఎక్స్టెన్షన్ మీ క్రోమ్ లో ఇంస్టాల్ చేయబడిన ఎక్స్టెన్షన్లన్నీ ఈజీ గా డిసేబల్, ఎనేబల్ మరియు అక్కడికక్కడే డిలిట్( అన్ ఇంస్టాల్) చేసుకోవటానికి సహకరిస్తుంది.

15. వీడియో డౌన్లోడ్: యుట్యూబ్ లోని వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు గురించి చాలా మందికి తెలుసు. అయితే కావలిసిన విడియో URL ను కాపీ చేసి, డౌన్లోడ్ చేసే సైట్లను ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ URL ను పేస్ట్ చేసే ప్రాసెస్ ఇష్టం లేకపోతే, మీ కోసం అదే పనిని Video Downloader [FVD] ఎక్స్టెన్షన్ చేసి పెడుతుంది. కాని తాజగా క్రోమ్ తన సొంత యుట్యూబ్ సైట్ నుండి వీడియో డౌన్లోడింగ్ చేసేందుకు సహకరిస్తున్న ఎక్స్టెన్షన్లను అన్నింటినీ బాన్ చేసింది. అయితే ఇది మిగతా వీడియో సైట్లలో బాగా పనిచేస్తుంది.

16. తెలుగు మ్యూజిక్ ప్రియులకు పనులు రీత్యా, సాంగ్స్ డౌన్లోడ్ పేజ్ లకు వెళ్ళే వీలు కుదరని వాళ్ళకి Telugu Mp3 Free Download అనే ఎక్స్టెన్షన్ ఒకే ఒక క్లిక్ తో తెలుగులో తాజాగా ఏ సినిమా పాటలు రిలీజ్ అయ్యయో లిస్టు తో పాటు డౌన్లోడ్ లింకులను ఇస్తుంది. ఆ సినిమాల ఆల్బంలు మీద మీ మౌస్ పాయింటర్ ఉంచితే, ఆ పర్టికులర్ సినిమా గురించి డిటైల్స్ కూడా ఇస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇది కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వలన సరిగా పనిచేయటం లేదు. కాని రికవర్ అయ్యి పని చేస్తే సినీ సంగీత ప్రియులకు ఇది మంచి ఎక్స్టెన్షన్.

17. Lazarus ఎక్స్టెన్షన్ మీరు ఏదైనా ఫార్మ్ లను నింపుతున్నప్పుడు అనుకోకుండా సిస్టం షట్ డౌన్ అయినా లేక బ్రౌజర్ క్రాష్ అయినా మళ్ళీ తిరిగి మీరు ముందు నింపిన డేటా ను రికవర్ చేసి ఆటోమేటిక్ గా ఇస్తుంది. అడ్రస్ లేదా ఏదైనా లాంగ్ డేటా ను ఎంటర్ చేస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

18. Google Dictionary by Google ఎక్స్టెన్షన్ తో మీరు ఏదైనా సైటులో ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక ఇంగ్లిష్ పదం అర్థం కావాలి అనుకుంటే, వెంటనే దాని పై డబుల్ క్లిక్ చేస్తే చిన్న పాప్ అప్ మెసేజ్ రూపంలో దాని అర్థం అర సెకెండ్ లో ఇస్తుంది. ఇలాగే ఇంగ్లిష్ టు తెలుగు అర్థాలు కావాలని అనుకుంటే ఈ ImTranslator ఎక్స్టెన్షన్ ను ఇంస్టాల్ చేసుకోండి.
 

క్రోమ్ ను ఆకర్షణీయంగా తాయారు చేయటానికి:
19. New Tab Manager అనే ఎక్స్టెన్షన్ మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చే టాబ్ ఎలా ఉండాలి అని మీ అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన యూజర్ ఇంటర్ఫేస్ లను ఎంచుకోవటానికి లిస్టు ఇస్తుంది. అందులో మీరు ఏదైనా ఒక స్టైల్ ను ఎంచుకుంటే, ఇకపై మీరు ఓపెన్ చేసే ప్రతీ టాబ్ మీరు ఇంతక ముందు ఎంచుకున్న స్టైల్ లో కనిపిస్తాయి. ఉదాహరణకు నాలాగే మీరు కూడా ఎక్కువ హంగులు అవి లేకుండా చిన్నగా ఆకర్షణీయమైన యూజర్ ఇంటర్ఫేస్ లను ఇష్టపడే వాళ్ళు అయితే, మినిమలిస్ట్ న్యూ టాబ్ అనే సబ్ ఎక్స్టెన్షన్ ఈ లిస్టులో దొరుకుతుంది. దీనిని మీరు ఎంచుకొని ఇంస్టాల్ చేసుకున్నాక, మీరు క్రోమ్ ను ఓపెన్ చేసిన వెంటనే మీరు ఉంటున్న ప్రదేశం పేరు, అక్కడి వాతావరణం, సెర్చ్ బాక్స్ మరియు గూగల్ సైట్ల లిస్టు ను అందంగా ఐకాన్లు మాదిరి గా రెండు వారసులలో ఇస్తుంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ లో అందమైన వాల్ పేపర్ ను చూపిస్తుంది.

20. Google Art Project ఎక్స్టెన్షన్ ఇంస్టాల్ చేసుకుంటే మీ క్రోమ్ కొత్త టాబ్ ఓపెన్ చేసిన వెంటనే అందమైన ఆర్ట్ వాల్ పేపర్స్ తో కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, వెన్ ఘో, మోనెట్ వంటి ఫేమస్ ఆర్టిస్ట్ ల ఆర్ట్స్ మీ కళ్ళ ముందు ఉంటాయి.

గమనిక: ప్రతీ క్రోమ్ ఎక్స్టెన్షన్ కి ఆప్షన్స్ ఉంటాయి. క్రోమ్ Options – More Tools – Extensions కు వెళితే అక్కడ ప్రతీ ఎక్స్టెన్షన్ క్రిందన Options అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఇంస్టాల్ చేసుకున్న ఎక్స్టెన్షన్ లను మీకు నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo